బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. దోషులైన బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ మోధియాలకు బెయిల్ మంజూరు చేస్తూ, వారి జీవిత ఖైదును సర్వోన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడపడం, వారి అప్పీల్‌లో వాస్తవాలు, చట్టపరమైన అంశాలను పరిగణించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయ‌స్థానం ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.

తమ శిక్షపై 2017 మేలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జోషి, మోధియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా దోషుల్లో ఒకరైన జోషి తీవ్ర వికలాంగుడనే విషయాన్ని కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

అయితే, నేర తీవ్రత దృష్ట్యా దోషులకు బెయిల్ ఇవ్వడాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. దీనిపై దోషుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రాథమిక ఎఫ్ఐఆర్‌లో ఒక దోషి పేరు లేదని, ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత కేసులో ఇరికించారని తెలిపారు. బాధితురాలు కూడా పోలీసులకు లేదా వైద్య పరీక్షల సమయంలో వీరి పేర్లను చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం గుంపులో ఉన్నారనే ఆరోపణ తప్ప, వారు నేరుగా నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లేవని వాదించారు.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలోనే నోటీసులు జారీ చేసింది. కాగా, 2024  జనవరిలో 11 మంది దోషుల ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజా బెయిల్ పొందిన ఈ ఇద్దరు కూడా ఆ 11 మందిలో ఉన్నారు.