సీనియర్ నటి రమ్యకృష్ణ తన వైవాహిక జీవితంపై వస్తున్న ప్రచారాలకు తెరదించారు. తన భర్త, దర్శకుడు కృష్ణవంశీతో తాను విడిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని... తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని ఆమె స్పష్టం చేశారు. తాజాగా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో ఆమె మొదటిసారి తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాను ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండనని, పనికి సంబంధించిన విషయాలు తప్ప పర్సనల్ విషయాలను బయట పెట్టడం తనకు ఇష్టం ఉండదని రమ్యకృష్ణ తెలిపారు. కృష్ణవంశీతో బంధం గురించి మాట్లాడుతూ... "నేను, కృష్ణవంశీ ఇప్పటికీ దంపతులమే. కానీ, సంతోషంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. కెరీర్‌ పరంగా మేం అలా ఉండాల్సి వస్తోంది. మా అబ్బాయి పుట్టినప్పుడు నేను సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో 15 రోజులకు ఒకసారి చెన్నై- హైదరాబాద్‌ ట్రావెల్‌ చేసేదాన్ని. నేను అలా వచ్చి వెళ్లిన ప్రతిసారి మా అబ్బాయి అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో నేను వాడిని చెన్నైలోనే చదివిస్తానని కృష్ణవంశీతో చెప్పాను" అని వెల్లడించారు.

రమ్యకృష్ణ, కృష్ణవంశీ 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కెరీర్, బాబు చదువు నిమిత్తం రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటూ సినిమాలు చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు నగరాల్లో ఉండటంతో గత కొంతకాలంగా వీరి దాంపత్యంపై రకరకాల రూమర్లు వచ్చాయి. అయితే, తాము విడిపోలేదని, పరస్పర అవగాహనతోనే కెరీర్, కుటుంబ బాధ్యతల కోసం ఇలా ఉంటున్నామని చెప్పడంతో ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.