దివంగత నటుడు శ్రీహరి కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. శ్రీహరి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారి కుమార్తె సంజనను ఆయన వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీహరి, శాంతి దంపతులకు శశాంక్, మేఘాంశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో పెద్దవాడైన శశాంక్‌కు, తమ కుటుంబానికి ఎంతోకాలంగా మిత్రులుగా ఉన్న కుటుంబం నుంచే వధువును ఎంపిక చేశారు. ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఈ పెళ్లి సంబంధాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమైనట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న శశాంక్, సంజనల నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు శ్రీహరి. ఆయన అకాల మరణం తర్వాత, ఆయన కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడి పెళ్లి వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత పెళ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ వార్తలపై శ్రీహరి కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.