ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్, ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తాను చాటిన రాజమౌళి తదుపరి చిత్రం కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఒక కీలకమైన అప్‌డేట్‌తో పాటు అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తించే ఒక హింట్ ఇచ్చింది.

‘వారణాసి’ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమా అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం సినిమా కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ పనులతో పాటు రీ-రికార్డింగ్ కూడా జరుగుతోందని స్పష్టం చేసింది. త్వరలోనే డబ్బింగ్ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపింది. సరిగ్గా ఏడాది క్రితం అత్యంత వైభవంగా జరిగిన ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ పూర్తికావడంతో సినిమా నిర్మాణంలో మరో ముఖ్యమైన ఘట్టం ముగిసినట్లయింది.

అయితే, ఈ అప్‌డేట్‌లో అసలైన కిక్ చివర్లో ఉంది. "ఇది అప్‌డేట్ అనుకుంటే అప్‌డేట్. కానీ, అసలైన బ్లాస్ట్ కోసం మరికొంత కాలం వేచి ఉండండి" అన్నట్లుగా చిత్ర బృందం తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఒక్క వ్యాఖ్యతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఆ ‘బ్లాస్ట్’ ఏంటి? సినిమాకు సంబంధించిన గ్లింప్స్ లేదా మేకింగ్ వీడియో విడుదల చేస్తారా? లేక మహేశ్‌ బాబు పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేస్తారా? అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చిన్న హింట్‌తోనే సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. ఏది ఏమైనా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా ప్రకటించినట్లుగా ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో మహేశ్‌ బాబును రాజమౌళి ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.