హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. కథానాయకుడు దుల్కర్ సల్మాన్ సినీ ప్రస్థానాన్ని, ఆయన ఎంచుకునే కథలను ప్రత్యేకంగా ప్రశంసించారు. "మలయాళంలో ‘ఉస్తాద్ హోటల్’ సమయం నుంచే దుల్కర్ గ్రాఫ్‌ను గమనిస్తున్నాను. మలయాళం నుంచి తమిళంలోకి వెళ్లి మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడితో సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగులోకి వచ్చి ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాలను అందుకున్నారు. ఆయన గొప్ప నటుడే కాకుండా ఎంతో మంచి వ్యక్తి. స్టార్ కిడ్ అయినప్పటికీ ఆ భావన ఎక్కడా కనిపించకుండా అందరితో ఎంతో వినయంగా ఉంటారు. ఆయనకున్న సినిమా ప్యాషన్ వల్ల ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. తెలుగులో సుమగారి తర్వాత అంతగా అభిమానించే మలయాళీ దుల్కర్ సల్మాన్ మాత్రమే" అని బన్నీ పేర్కొన్నారు.

ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న నాయిక సాత్వికకు ఇది ఒక డ్రీమ్ లాంచ్ అని, తెలుగు ఇండస్ట్రీలోకి ఆమెకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కమర్షియల్ స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించిన శ్రుతి హాసన్‌ను అభినందించారు. అలాగే నటి రోహిణి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుందని ప్రశంసించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు, సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్ అందించారు. దర్శకుడు పవన్ సాధినేని ప్రతిభావంతుడని, ఆయనకు దక్కాల్సిన అసలైన గుర్తింపు ఈ సినిమాతో తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సినిమా నిర్మాణం గురించి మాట్లాడుతూ.. స్వప్న, ప్రియాంక, సందీప్, రమ్యలు రెండో తరం నిర్మాతలుగా గొప్ప కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తూ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని అల్లు అర్జున్ కొనియాడారు. "మా నాన్న అల్లు అరవింద్ గారు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సాధారణంగా ఆయన అంత ఎగ్జైట్ అయితే సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. టీజర్ చూసినప్పుడు నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్ కనిపించింది. ప్రతి మహిళ కలను సాకారం చేసే ఒక మంచి పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది" అని పేర్కొన్నారు. చివరగా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన చిత్ర యూనిట్‌కు, మీడియాకు, పోలీస్ శాఖకు మరియు తన అభిమానులకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు.
Play video