సోషల్ మీడియాలో పరిచయాలు ఎంత ప్రమాదకరమో చాటిచెప్పే ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి, ఒక కుటుంబంతో స్నేహంగా మెలిగి వారి ఇంట్లోనే భారీ చోరీకి పాల్పడింది. నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని విలువైన వజ్ర, బంగారు ఆభరణాలతో పరారైంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒక యువతి పరిచయమైంది. కొద్దిరోజులకే వారి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో సదరు యువతి, బాధితురాలి ఇంటికి వచ్చింది. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి, కొన్ని రోజుల పాటు వారి ఇంట్లోనే బస చేసింది. ఆమె మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు ఆశ్రయం కల్పించారు.

కొన్ని రోజులు గడిచాక, ఇంట్లో వారి నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్న ఆ యువతి తన అసలు స్వరూపం బయటపెట్టింది. అదును చూసి, ఇంట్లోని బీరువాలో ఉన్న 11.3 గ్రాముల వజ్రాల నెక్లెస్‌తో పాటు మరికొన్ని బంగారు ఆభరణాలను దొంగిలించి అక్కడి నుంచి పరారైంది.

మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలిని గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో అపరిచితులను, ముఖ్యంగా సోషల్ మీడియా స్నేహితులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.