ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. సోమవారం రామోజీరావు సేవలను స్మరించుకుంటూ వారిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా రామోజీని స్మరించుకున్నారు. తెలుగు జర్నలిజంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించి, టెలివిజన్, సినిమా రంగాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగు వెలుగు రామోజీరావు అని కొనియాడారు. "ఓటమి ఎరుగని వ్యక్తిత్వం, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయతీ వంటి ఆయుధాలతో రామోజీరావు సంస్థలకు ధైర్యాన్ని ఇచ్చారు. తన మీడియా సంస్థల ద్వారా సమాజంపై ఎంతో ప్రభావం చూపిన దార్శనికుడు ఆయన. ఆ మహనీయుడి సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందాం" అని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా రామోజీరావుకు అక్షర నివాళి అర్పించారు. "సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు. అసాధారణ పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే గుణంతో మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన అక్షరయోధుడు ఆయన. చివరిశ్వాస వరకూ ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేసిన ఆయన జీవితం మనందరికీ మార్గదర్శకం" అని లోకేశ్ అన్నారు. తెలుగు వెలుగు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.