ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా కలిశారు. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆమె, పెళ్లి కార్డును అందించి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తన కుమార్తె అంజిలి రెడ్డి, కాబోయే అల్లుడు సోమల రఘురామ్ రెడ్డిల వివాహానికి సంబంధించిన వివరాలను చంద్రబాబుకు షర్మిల వివరించారు. పెళ్లికి తప్పనిసరిగా విచ్చేయాలని ఆమె కోరారు.

సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం వైఎస్ షర్మిల ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చంద్రబాబుకు వెడ్డింగ్ కార్డు అందజేస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. "ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని తన నివాసంలో కలిసి నా కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డి ల వివాహ మహోత్సవానికి విచ్చేసి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది" అని పేర్కొన్నారు.

కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల.. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆమె వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

షర్మిల కుమార్తె వివాహం నవంబరు 25న జరగనుండగా, డిసెంబరు 5న రిసెప్షన్ నిర్వహించనున్నారు.