ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆయన ఒక రోజు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు సోమవారం అధికారికంగా ఖరారు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.

అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 9:15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో బయలుదేరి, 9:25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి పయనమవుతారు.

ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం, రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12:10 గంటల కల్లా 1 జనపథ్‌కు చేరుకుంటారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత, అదే రోజు సాయంత్రం తిరిగి రాష్ట్రానికి బయలుదేరతారు. సాయంత్రం 6:50 గంటలకు 1 జనపథ్ నుంచి బయలుదేరి, రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో పయనమై రాత్రి 9:30 గంటలకు విజయవాడ చేరుకుంటారు.