తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 11 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌తో పాటు జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్‌కల్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. సిద్దిపేట జిల్లా నంగునూర్‌లో 12.5, మెదక్ జిల్లా చిట్కుల్‌లో 12.8 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్‌పూర్‌లో 11.2 డిగ్రీలు, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల 11.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 18.2 డిగ్రీలుగా నమోదు కాగా, శివారు ప్రాంతాల్లో 14 డిగ్రీల వరకు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ (టీజీడీపీఎస్), హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపాయి. రాబోయే వారం రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.