మస్కట్ వేదికగా జరిగిన పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్ పోరులో భారత యువ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. దాయాది పాకిస్థాన్‌తో చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా ఒక వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఈ ట్రోఫీని ముద్దాడిన యువ జట్టుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

భారత జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "భారత క్రికెట్‌కు ఇది ఎంతో గొప్ప రోజు. నేటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 గెలిచిన మన యువ క్రికెటర్లను చూసి ఎంతో గర్వపడుతున్నాను. వీరి విజయం ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు.

అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో సెంచరీ సాధించగా, అబ్దుల్ ఖాదిర్ 80, కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ 63 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా, చిగురుపాటి వెంకట మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

అనంతరం 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారత కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ 101 బంతుల్లో 80 పరుగులు చేసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, ఆర్యవీర్ సెహ్వాగ్ 61 బంతుల్లో 58 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, మధ్యలో స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయిన భారత్ 254 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా అద్భుత పోరాటపటిమ కనబరిచారు. వీరిద్దరూ కలిసి 9వ వికెట్‌కు 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను తిరిగి భారత్ వైపు తిప్పారు. చౌహాన్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి అవుటైనా, ఉల్వా క్రీజులో పాతుకుపోయి ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు.

చివరి ఓవర్లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట నిలకడగా ఆడి సమీకరణాన్ని చివరి బంతికి 3 పరుగులుగా మార్చారు. ఆఖరి బంతికి అహ్మద్ హుస్సేన్ వేసిన డెలివరీని మోహిత్ ఉల్వా బౌండరీకి తరలించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఉల్వా 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు నిరాశ ఎదురవ్వగా, భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.