రాప్తాడు విద్యార్థినికి నిర్వహించిన మరో ప్లాస్టిక్ సర్జరీ విజయవంతమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. బాలికకు కుట్లు తీసివేసి, గాయాన్ని శుభ్రపరిచి తిరిగి కుట్లు వేసే ప్రక్రియ (డీబ్రిడ్‌మెంట్, రీ-స్యూచరింగ్) పూర్తయిందని పేర్కొన్నారు. ఆమెను త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించనున్నట్లు వివరించారు.

కొన్ని రోజులుగా ఆమె వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటోందని, ప్రస్తుతం ద్రవ ఆహారం కూడా ఇస్తున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. తాజాగా శనివారం నిర్వహించిన సర్జరీతో ఆమె కోలుకోవడంలో మరో ముందడుగు పడినట్లయింది. బాధితురాలి వైద్య ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.