అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో యువ భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నిన్న‌ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఒక్క వికెట్ తేడాతో గెలిచి, రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతి వరకు పోరాడి ఛేదించి సంచలనం సృష్టించింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన దశలో మోహిత్ ఉల్వా బౌండరీ బాది భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఒక దశలో 254 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ క్లిష్ట సమయంలో మానల్ చౌహాన్ (32 బంతుల్లో 47), మోహిత్ ఉల్వా (49 నాటౌట్) అద్వితీయ పోరాట పటిమ కనబరిచారు. వీరిద్దరూ కలిసి 57 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా, చివరి బంతికి మోహిత్ ఫోర్ కొట్టి గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.

మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ తమ ఓటమికి గల కారణాలపై మాట్లాడాడు. తాము మంచి స్కోరు సాధించినప్పటికీ, తమ బౌలర్ల దిశలేని బౌలింగే ఓటమికి దారితీసిందని అంగీకరించాడు. "భారత్ అద్భుతంగా ఆడింది. వారి ఆట‌ను మెచ్చుకోవాల్సిందే. మేం భారీ స్కోరు చేసినా, మా బౌలర్లు సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయడంలో విఫలమయ్యారు. అదే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది" అని యూసఫ్ వ్యాఖ్యానించాడు. ముగ్గురు పేసర్లు ఎక్కువ సమయం తీసుకోవడం వల్లే తమ జట్టు స్లో ఓవర్ రేట్‌ న‌మోదైందని కూడా వివరించాడు.