సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయనడానికి నిదర్శనంగా నిలిచే ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక ఐఫోన్, మోటార్‌సైకిల్ కొనేందుకు డబ్బుల కోసం 13 ఏళ్ల బాలిక, తన ముగ్గురు స్నేహితులతో కలిసి సొంత‌ తాతనే హత్య చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. కేరళలోని కరవట్టలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డుకు 740 పేజీల ఛార్జ్‌షీట్ సమర్పించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల బాలిక, 16, 17 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు ఈ హత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 15 రాత్రి ఈ నేరం జరిగింది. నిందితులు సుమారు రెండు నెలల పాటు ఇన్‌స్టాగ్రామ్‌ చాట్స్ ద్వారా పక్కా ప్రణాళిక రచించారు. ప్లాన్ ప్రకారం, ముగ్గురు బాలురు బాలిక తాత (67) అద్దెకు ఉంటున్న ఇంటి బాత్రూం పైకప్పు పెంకులు తొలగించి, వెంటిలేషన్ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించారు.

అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధుడి నోట్లో గుడ్డలు కుక్కి, ముఖంపై దుప్పటి కప్పి, కాళ్లు చేతులు కట్టేశారు. ఎలాంటి ఆయుధాలు వాడకుండానే తీవ్రంగా కొట్టడంతో ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం ఇంట్లోని సుమారు నాలుగున్నర తులాల బంగారం దొంగిలించారు. నిందితులు ఈ దారుణాన్ని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బాలికకు లైవ్‌లో చూపించినట్లు విచారణలో తేలింది.

ఈ ఘటన ఆగస్టు 17న వెలుగులోకి రాగా, అదే రోజు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుల ఫోన్ల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ సంభాషణలను స్వాధీనం చేసుకుని, మెటా సంస్థ నుంచి ధ్రువీకరణ పొందారు. ఆరు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోగా, వాటిలో ఒకటి హత్య జరిగిన రోజే యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. నిందితులు రైల్వే స్టేషన్‌కు రావడం, ఇంటికి చేరుకోవడం, తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి.

ఈ కేసులో 87 మంది సాక్షులను, 98 పత్రాలను, 12 వస్తువులను పోలీసులు ఆధారాలుగా ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. హత్యకు పాల్పడిన ముగ్గురు బాలురను మేజర్లుగా పరిగణించి విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ జువైనల్ జస్టిస్ బోర్డును కోరింది. నేరం తీవ్రత, నిందితుల మానసిక స్థితి, నేపథ్యం వంటి అంశాలను పరిశీలించి బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. 13 ఏళ్ల బాలికపై మాత్రం బోర్డులోనే విచారణ కొనసాగనుంది.