ఒమన్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. నేడు జరగనున్న ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కేవలం టైటిల్ గెలవడమే కాకుండా, గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో యువ భారత్ బరిలోకి దిగుతోంది. గత మూడు ఎడిషన్లుగా టైటిల్ దూరమైన భారత జట్టు, ఈసారి ఎలాగైనా కప్ సాధించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది.

భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఈ టైటిల్‌ను ముద్దాడాలని చూస్తుండగా, డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ మూడోసారి కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ 191 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ టోర్నీ లీగ్ దశలోనూ పాక్ చేతిలో భారత్‌కు ఓటమి తప్పలేదు. 209 పరుగుల లక్ష్యఛేదనలో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పాక్‌ను, వికెట్ కీపర్ హంజా జహూర్ అద్భుతమైన అజేయ సెంచరీతో గెలిపించాడు. ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడానికి ఫైనల్ సరైన వేదిక అని భారత జట్టు భావిస్తోంది.

సెమీఫైనల్స్‌లో ఇరు జట్లు ఘన విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో ఇషాన్ సూద్ మూడు వికెట్లతో రాణించగా, ఛేదనలో కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (93), ఆర్యవీర్ సెహ్వాగ్ (51), వీకే వినీత్ (57) అద్భుతంగా రాణించారు. మరో సెమీస్‌లో పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రిజ్వానుల్లా కేవలం 30 పరుగులిచ్చి 5 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు.

ఈ ఫైనల్‌లో అందరి దృష్టి టీమిండియా ఓపెనర్, మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌పైనే ఉంది. ఈ టోర్నీలో అతను నాలుగు మ్యాచ్‌లలో 101 సగటుతో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. బౌలింగ్‌లో 11 వికెట్లు తీసిన ఇషాన్ సూద్ కీలకం కానున్నాడు. పాకిస్థాన్ తరఫున ఉస్మాన్ ఖాన్ (238 పరుగులు), గత మ్యాచ్ హీరో హంజా జహూర్, 11 వికెట్లు పడగొట్టిన రిజ్వానుల్లా భారత జట్టుకు సవాల్ విసరనున్నారు.

గత రెండు మ్యాచ్‌లలో గెలిచామన్న ఆత్మవిశ్వాసంతో పాకిస్థాన్ బరిలోకి దిగుతున్నప్పటికీ, భారత్-పాక్ మ్యాచ్‌లో ఫలితం ఎప్పుడైనా మారవచ్చని వారికి తెలుసు. వ్యక్తిగత ప్రదర్శనలపై ఆధారపడకుండా జట్టుగా రాణించి టైటిల్ కరవు తీర్చుకోవాలని యువ భారత్ భావిస్తోంది. దీంతో టైటిల్‌తో పాటు ఇరు దేశాల అభిమానుల ప్రతిష్ట ముడిపడి ఉన్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.