అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై చైన్‌సాతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. పల్మనరీ ఎంబాలిజం సమస్య తలెత్తడంతో అతడిని శుక్రవారం రాత్రి అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

గత 13 రోజులుగా రిమాండ్ ఖైదీగా అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న హేమంత్ ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు సీటీ స్కాన్‌లో నిర్ధారణ అయింది. ఈ రక్తపు గడ్డలు గుండె, మెదడు లేదా ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్యులు కోర్టుకు విన్నవించారు. ఇందుకు అవసరమైన అధునాతన వైద్య సదుపాయాలు, హార్ట్-లంగ్ మెషీన్ వంటి వసతులు అనంతపురం ఆసుపత్రిలో లేకపోవడంతో, మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించాలని సూచించారు.

కోర్టు అనుమతి లభించిన అనంతరం, సుమారు 10 మంది సిబ్బందితో కూడిన భారీ భద్రత మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో హేమంత్‌ను కర్నూలుకు తరలించారు. అంతకుముందు, కొన్ని అధికారిక లాంఛనాల నిమిత్తం అతడిని రెడ్డిపల్లి జైలుకు తీసుకెళ్లారు.

అక్టోబర్ 31న రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై హేమంత్ (21) ఎలక్ట్రిక్ రంపం (చైన్‌సా)తో దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమెను అడ్డుకోబోయిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. బాధితురాలు ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది.

దాడి అనంతరం అటవీ ప్రాంతంలో తలదాచుకున్న హేమంత్‌ను అరెస్ట్ చేసే క్రమంలో, అతడు పోలీసులపైకి తిరగబడటంతో వారు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాళ్లకు గాయాలైన హేమంత్‌కు గాంగ్రీన్ సోకడంతో వైద్యులు అతని కుడి కాలును తొలగించారు. ఇటీవల అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో పాటు, బెడ్ పైనుంచి కింద పడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్‌లో వైద్య సేవలు కొనసాగుతున్నాయి.