మిత్రుడితో సరదాగా చేసిన ఓ ప్రాంక్‌ చివరకు ప్రాణం తీసింది. రసగుల్లా ఆకారంలో ఉన్న నాటు బాంబును స్వీటుగా భావించి నోట్లో పెట్టుకున్న వ్యక్తి.. కొరికిన వెంటనే అది పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిండోరి జిల్లాలోని కోత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాజేంద్ర (35) అనే వ్యక్తికి అతడి స్నేహితుడు రాంభగత్‌ రసగుల్లా ఆకారంలో ఉన్న నాటు బాంబును ఇచ్చాడు. దాన్ని సరదాగా తినమన్నాడు. అది నిజంగానే స్వీటు అనుకున్న రాజేంద్ర నోట్లో పెట్టుకుని కొరికాడు. దీంతో బాంబు నోట్లోనే పేలింది. తీవ్రంగా గాయపడిన అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేంద్ర మృతి చెందాడు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ధర్ము అనే వ్యక్తి తనకు ఆ నాటు బాంబు ఇచ్చాడని రాంభగత్‌ పోలీసులకు తెలిపినట్లు కోత్వాలి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి దుర్గా ప్రసాద్‌ నాగ్‌పురే వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రాంభగత్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), పేలుడు పదార్థాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.