మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమి వస్తే అమ్మేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని చూడకుండా, పేదలు, అమరవీరులు, ఉద్యమకారులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈరోజు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ... "మియాపూర్‌లోని 550 ఎకరాల్లో 200 ఎకరాలు పేదల ఇళ్లకు, 100 ఎకరాలు అమరవీరులకు, మరో 100 ఎకరాలు ఉద్యమకారులకు కేటాయించండి. మిగిలిన భూమిలో పాఠశాలలు, కాలేజీలు కడితే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం" అని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏడాదిలోపే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ భూముల వ్యవహారాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చే చిత్తశుద్ధి ఉందా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఎక్కడో 80 కిలోమీటర్ల దూరంలోని ఎర్రవెల్లిలో కాకుండా, హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మియాపూర్‌లోనే అమరవీరులకు ఇళ్లు కట్టివ్వాలని సవాల్ విసిరారు. 'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' పేరుతో జరుగుతున్న స్కాంలో భాగస్వాములైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పారిశ్రామికవేత్తలను ఆయన హెచ్చరించారు.