యునైటెడ్ కింగ్‌డమ్‌(యూకే)లో చదువుతున్న భారతీయ విద్యార్థికి చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కేసులో భారీ శిక్ష పడింది. ఆన్‌లైన్‌లో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువుకావడంతో 27 ఏళ్ల బిలాల్ కాజీకి చెస్టర్ క్రౌన్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

చెస్టర్, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బిలాల్ కాజీ, ఆన్‌లైన్ ద్వారా బాలికలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 70 మంది బాధితులను గుర్తించారు. మరో 180 మంది బాధితులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 37 అభియోగాలను కాజీ కోర్టులో అంగీకరించాడు.

ఈ కేసును చెషైర్ పోలీస్ చరిత్రలోనే అతిపెద్ద ఆన్‌లైన్ చైల్డ్ అబ్యూజ్ విచారణగా అధికారులు పేర్కొన్నారు. సుమారు 28 పోలీస్ బృందాలు సమన్వయంతో ఈ కేసును దర్యాప్తు చేశాయి. 2023 జులైలో దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కాజీని హీత్రూ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి స్టీవెన్ ఎవరెట్, కాజీని ‘డేంజరస్ ప్రిడేటర్’గా అభివర్ణించారు. 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు, అదనంగా ఎనిమిదేళ్ల ఎక్స్‌టెండెడ్ లైసెన్స్ కాలం కూడా విధించారు. శిక్షాకాలంలో కనీసం మూడింట రెండొంతుల సమయం జైలులోనే గడపాలని, జీవితకాలం సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్‌లో కొనసాగాలని ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు ఒక 'భారీ దర్యాప్తు' అని బ్రిటిష్ అధికారులు తెలిపారు.