"గ్లోబల్ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్‌ను కేవలం సందర్శించడం కాదు, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఆవిష్కరించండి, ఎదగండి. మీ ఫ్యాక్టరీలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ను మీ కార్పోరేట్ హోమ్‌గా మార్చుకోండి" అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైన సీఐఐ 31వ పార్టనర్‌షిప్ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పూర్తి అండగా ఉంటుందని, ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉండి, వారి సొంత టీమ్‌ల కంటే వేగంగా స్పందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

కొత్త చట్టం.. పక్కాగా ప్రోత్సాహకాలు 
ఈ సదస్సులో చర్చిస్తున్న ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్ (వ్యాపారం, సాంకేతికత, నమ్మకం) అనే మూడు అంశాలకు తమ ప్రభుత్వంలో వాస్తవ రూపం కల్పిస్తామని లోకేశ్‌ తెలిపారు. వ్యాపార నిర్వహణలో స్పీడ్ (వేగం), పాలసీల్లో స్టెబిలిటీ (స్థిరత్వం), సర్వీస్ (సేవ) తమ విధానమని స్పష్టం చేశారు. పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం నింపేందుకు త్వరలోనే 'ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్' తీసుకురాబోతున్నామని ఆయన కీలక ప్రకటన చేశారు. అలాగే, ప్రభుత్వం వాగ్దానం చేసిన ప్రోత్సాహకాలను నేరుగా పారిశ్రామికవేత్తలకే అందేలా, వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 'ఎస్క్రో ఖాతాల' ద్వారా చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఏపీ బలం.. మారిన పారిశ్రామిక స్వరూపం 
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం, విశాఖ ప్రధాన పోర్టు, నిర్మాణంలో ఉన్న నాలుగు కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఇటీవల ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాన్ని చాటుతున్నాయని లోకేశ్‌ వివరించారు. కియా మోటార్స్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక రంగం పుంజుకుందన్నారు.

2024 జూన్ నుంచి తమ ప్రభుత్వానికి రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి హామీలు వచ్చాయని, ఇందులో రూ.17.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు కాగా, రూ.5.9 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న 15 బిలియన్ డాలర్ల ఏఐ హబ్, డేటా సెంటర్‌ను దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐగా ఆయన అభివర్ణించారు.

మూడు సక్సెస్ స్టోరీలు.. ప్రభుత్వ సహకారం 
తమ ప్రభుత్వం పరిశ్రమలకు ఎలా అండగా నిలుస్తుందో చెప్పడానికి లోకేశ్‌ మూడు కంపెనీల సక్సెస్ స్టోరీలను ఉదహరించారు. టెక్స్‌టైల్ రంగం నుంచి ఏరోస్పేస్, డిఫెన్స్‌లోకి మారిన రేమండ్స్ (ఫ్లిప్), ప్రభుత్వ సహకారంతో అతిపెద్ద సోలార్ సెల్ తయారీదారుగా ఎదిగిన ప్రీమియర్ ఎనర్జీస్ (స్కేల్), మచిలీపట్నానికి చెందిన చిన్న కంపెనీ ఎస్‌ఎస్‌డీ పాలిమర్స్‌ను క్వాంటం వ్యాలీలో భాగస్వామిని చేయడం (ఇంక్యుబేషన్) ద్వారా తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

ప్రధాన కార్యాలయాలను ఏపీకి తరలించండి 
పరిశ్రమల స్థాపనకే పరిమితం కాకుండా, తమ ప్రధాన కార్యాలయాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని లోకేశ్‌ పారిశ్రామికవేత్తలను కోరారు. ఇక్కడి స్వచ్ఛమైన గాలి, ట్రాఫిక్ లేని ప్రశాంత జీవన విధానం, నైపుణ్యం కలిగిన యువత, ప్రపంచ స్థాయి కనెక్టివిటీ, గూగుల్ ఏఐ హబ్, అమరావతి క్వాంటం వ్యాలీ వంటి భవిష్యత్ ప్రాజెక్టులు ఇందుకు దోహదం చేస్తాయన్నారు. తాను, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఒక వాట్సాప్ సందేశం దూరంలోనే అందుబాటులో ఉంటామని, సమావేశాల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. జ్ఞాపకాలతో పాటు, ఏపీ నుంచి భవిష్యత్తును నిర్మించుకునే ప్రణాళికతో తిరిగి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.