బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన అరంగేట్ర చిత్రం ‘కహో నా ప్యార్ హై’ (2000) సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గతంలో పంచుకున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తన తండ్రి రాకేశ్ రోషన్‌కు తెలియకుండానే ఎడిటింగ్‌లో కొన్ని మార్పులు చేసేవాడినని ఆయన వెల్లడించాడు. ఒక పాత ఇంటర్వ్యూలో హృతిక్ ఈ విషయాలను గుర్తుచేసుకున్నాడు.

సినిమా ఎడిటింగ్ ప్రక్రియలో రాకేశ్ రోషన్ ఎంతో కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించేవారని హృతిక్ తెలిపాడు. కొడుకు అనే మమకారం చూపకుండా, తాను ఎంతో బాగా నటించానని భావించిన షాట్లను కూడా తండ్రి నిర్దాక్షిణ్యంగా తొలగించేవారని చెప్పాడు. తాను ఎంతో కష్టపడి చేసిన సన్నివేశాలు కత్తెరకు గురవుతుండటంతో హృతిక్ కొంత బాధపడేవారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ఉపాయం ఆలోచించారు.

రోజూ ఎడిటింగ్ పనులు ముగించుకుని రాకేశ్ రోషన్ ఇంటికి వెళ్లిన తర్వాత, హృతిక్ రహస్యంగా ఆటోలో తిరిగి ఎడిటింగ్ స్టూడియోకు వెళ్లేవాడు. తన వద్ద ఉన్న తాళాలతో రూమ్ తెరిచి, తండ్రి తొలగించిన షాట్లను తిరిగి సినిమాలో చేర్చేవాడు. ఆ మార్పులను ఎడిటర్‌కు చూపించి, సీన్ బాగుందో లేదో అడిగేవారు. ఎడిటర్ కూడా బాగుందని సంతృప్తి వ్యక్తం చేయడంతో, మరుసటి రోజు ఆ మార్పులను తన తండ్రికి చూపించమని కోరేవాడు.

ఆ సన్నివేశాలను చూసిన రాకేశ్ రోషన్, ఇదంతా తన కొడుకు చేసిన పనే అని గ్రహించి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయేవారు. అయితే, ఆ మార్పుల వల్ల సీన్ మరింత మెరుగ్గా రావడంతో చివరకు వాటిని అంగీకరించేవారని హృతిక్ నవ్వుతూ చెప్పాడు. తండ్రీకొడుకుల మధ్య సాగిన ఈ దోబూచులాటల నడుమ రూపుదిద్దుకున్న ‘కహో నా ప్యార్ హై’ చిత్రం హృతిక్ కెరీర్‌లో ఒక సంచలన విజయంగా నిలిచిన సంగతి తెలిసిందే.