దేశంలోని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల లాభాలు భారీగా పెరిగాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్‌) బ్యాంకుల నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి చెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరింది. రుణాల మంజూరు పెరగడం, వాటిపై వచ్చే వడ్డీ ఆదాయం అధికం కావడం ఇందుకు ప్రధాన కారణాలని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ నివేదిక వెల్లడించింది.

బ్యాంకులు ఇచ్చిన రుణాలు దాదాపు 19 శాతం పెరిగాయి. దీంతో రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయం మెరుగుపడింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకుల లాభాల వృద్ధి కేవలం 4.2 శాతానికే పరిమితం కావడం కూడా ఈసారి పెరుగుదలకు దోహదపడింది. అయితే బాండ్లపై వడ్డీ రేట్లు పెరగడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది.

బ్యాంకుల ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 0.07 శాతం పాయింట్లు పెరిగి 1.39 శాతానికి చేరింది. 2024-25 రెండో త్రైమాసికం తర్వాత ఇదే అత్యధికం. అయితే ఒకేసారి వచ్చిన ప్రత్యేక ఆదాయాలను పక్కనపెడితే ఈ రాబడిలో పెద్దగా మార్పు లేదు. ఈక్విటీపై మధ్యస్థ రాబడి (ఆర్‌ఓఈ) 0.79 శాతం పాయింట్లు పెరిగి 13.6 శాతానికి చేరింది. కేటాయింపులు తగ్గడంతో కొన్ని ప్రైవేటు బ్యాంకుల లాభాలు ఎక్కువగా పెరిగాయి.

బ్యాంకుల ఆర్థిక భద్రతను సూచించే కామన్‌ ఈక్విటీ టైర్‌-1 (సీఈటీ-1) నిష్పత్తి కూడా ఏడాది క్రితంతో పోలిస్తే 0.87 శాతం పాయింట్లు పెరిగి 15.8 శాతానికి చేరింది. అన్ని బ్యాంకులూ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ప్రమాణం కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో బ్యాంకుల లాభాల వృద్ధి కొంత తగ్గవచ్చని కేర్‌ఎడ్జ్‌ అంచనా వేసింది. ఒకేసారి వచ్చిన ప్రత్యేక ఆదాయాలు తగ్గడం, బాండ్ల ద్వారా ఆదాయం బలహీనంగా ఉండటం, రుణాల నష్టాలను ముందుగానే అంచనా వేసి నిధులు కేటాయించాల్సి రావడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. కొత్తగా అమల్లోకి రానున్న ఎక్స్‌పెక్టెడ్‌ క్రెడిట్‌ లాస్‌ (ఈసీఎల్‌) విధానానికి సిద్ధమవుతూ బ్యాంకులు అదనపు కేటాయింపులు చేయాల్సి రావచ్చని తెలిపింది.