వైద్య విద్యలో పరిశోధనలను ప్రోత్సహించే దిశగా విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు రోజుల పాటు నిర్వహించిన పీహెచ్‌డీ, పరిశోధన కమిటీ సమావేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్ (యూజీ) విద్యార్థుల నుంచి వచ్చిన 1,622 పరిశోధన స్కాలర్‌షిప్ దరఖాస్తులను పరిశీలించారు. వీటితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులకు ప్రత్యేకంగా పరిశోధన గ్రాంట్లు కేటాయించాలని, కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ హెల్త్ వంటి అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

వర్సిటీ ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ అధ్యక్షతన ఈ నెల 9 నుంచి 11 వరకు ఈ సమావేశాలు జరిగాయి. ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్లలో భాగంగా 10 నుంచి 25 గ్రాంట్లను పీజీ విద్యార్థులకు కేటాయించాలని కమిటీ తీర్మానించింది. పీజీ విద్యార్థులు తమ డిసర్టేషన్‌తో పాటు అదనంగా చేపట్టే స్వతంత్ర ప్రాజెక్టులకు ఈ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి. మరోవైపు, వైద్య విద్యలో ఏఐ, డిజిటల్ హెల్త్ కోర్సుల రూపకల్పనపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు.

వీటితో పాటు, అనుబంధ కళాశాలల్లో పరిశోధన నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సూచించింది. మంగళగిరి ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన నిపుణులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. యూజీ స్కాలర్‌షిప్‌ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడం విద్యార్థుల్లో పరిశోధనల పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని వీసీ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం ద్వారా భవిష్యత్తులో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పీజీ విద్యార్థులకు గ్రాంట్లు కేటాయించడం వల్ల వారి పరిశోధనా సామర్థ్యం మెరుగుపడుతుందని రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయి సుధీర్ తెలిపారు. పరిశోధనల నాణ్యతను పెంచేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులు డాక్టర్ ఎం. లక్ష్మీ సూర్యప్రభ వివరించారు. ఈ సమావేశాల్లో ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్లు, పీహెచ్‌డీల పురోగతిని కూడా కమిటీ సమీక్షించింది.