అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కు ఆర్లింగ్టన్ జాతీయ స్మశాన వాటికలో ఊహించని అనుభవం ఎదురైంది. అత్యంత పవిత్రంగా భావించే 'అజ్ఞాత సైనికుడి సమాధి' (Tomb of the Unknown Soldier) వద్ద మౌనం పాటించకుండా, నవ్వుతూ ఫొటోలకు పోజులివ్వడంతో అక్కడి కాపలా సైనికుడు (సెంటినల్) ఆయనను, ఆయన బృందాన్ని బహిరంగంగా హెచ్చరించారు. ఈ ఘటన 'వెటరన్స్ డే' వేడుకల అనంతరం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆర్లింగ్టన్ స్మశాన వాటికలో జరిగిన వెటరన్స్ డే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆయన భార్య జెన్నిఫర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రికీ బురియాతో సహా ఇతర సీనియర్ అధికారులు అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద ఫొటోలు దిగేందుకు గుమిగూడారు. ఆ సమయంలో వారు నవ్వుతూ, మాట్లాడుకుంటూ ఉండటం అక్కడి వీడియో ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది.

ఆ ప్రదేశంలో అలాంటి ప్రవర్తన నిషిద్ధం కావడంతో అక్కడే గార్డ్ డ్యూటీలో ఉన్న సైనికుడు గట్టి స్వరంతో.. "సందర్శకులందరూ అన్ని సమయాల్లోనూ నిశ్శబ్దాన్ని, గౌరవాన్ని పాటించాలి" (All visitors will maintain an atmosphere of silence and respect at all times) అని హెచ్చరించారు. ఈ మాటలు విన్న హెగ్సెత్, ఒక్క క్షణం గార్డ్ వైపు చూసి, ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా మెట్లు ఎక్కి వెళ్లిపోయారు.

యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయి, గుర్తింపునకు నోచుకోని సైనికుల స్మారకార్థం ఈ సమాధిని నిర్మించారు. 'ది ఓల్డ్ గార్డ్'గా పిలిచే 3వ యూఎస్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన సైనికులు 24 గంటలూ ఇక్కడ కాపలా కాస్తుంటారు. ఈ ప్రదేశంలో సంపూర్ణ నిశ్శబ్దం పాటించడం తప్పనిసరి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరైన పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమం ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడం గమనార్హం.

ఈ సంఘటనపై పెంటగాన్ చీఫ్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందించారు. "ఆ పవిత్రమైన రోజున, అక్కడి హుందాతనాన్ని కాపాడాలని ఓ సైనికుడు గౌరవప్రదంగా, సరిగ్గానే అందరికీ గుర్తుచేశారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగాలను రక్షణ మంత్రి, మా శాఖ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ప్రతినిధుల సభలో తనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నుంచి హెగ్సెత్ బయటపడిన మరుసటి రోజే ఈ వివాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.