ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా, రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని యూఏఈ కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు.

యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, సుమారు రూ.  లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దే ప్రణాళికలను ఆయన వివరించారు. ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి వివిధ రకాల పండ్లు ఎగుమతి అవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. యూఏఈ ఏర్పాటు చేయనున్న ఫుడ్ క్లస్టర్‌లో భాగస్వామి కావాలని అక్కడి వ్యవసాయ-ఆహార సంస్థ ‘సిలాల్’ను ఆహ్వానించారు. అదేవిధంగా, చిత్తూరు జిల్లాలో దుబాయ్‌కు చెందిన ‘ఫ్లోర్‌మాస్టర్’ పరిశ్రమ ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అనంతరం, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (వైపో) డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ‘వైపో-ఆంధ్రప్రదేశ్ అకాడమీ’ ఏర్పాటుతో పాటు మేధో సంపత్తి హక్కులు, పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లపై విద్యార్థులు, స్టార్టప్‌లకు శిక్షణ ఇచ్చే అంశంపై చర్చించారు. చేనేత, హస్తకళలు వంటి స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌లు సాధించేలా ‘వైపో’ సహకారాన్ని సీఎం కోరారు.

జపాన్ రాయబారి కీచి ఓనోతో జరిగిన భేటీలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, కీలక ఖనిజాల లభ్యతపై చర్చలు జరిగాయి. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జపాన్ ప్రతినిధులు.. రేర్ ఎర్త్ ఖనిజాల సరఫరా, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఉక్కు దిగుమతులపై ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.