మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మెదక్ జిల్లా పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు నిందితుడికి రూ. 20,000 జరిమానా కూడా విధించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడికి, మెదక్ జిల్లాకు చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. చదువు మానేసి ఇంట్లోనే ఉంటున్న ఆ బాలిక, 2021 మే 11న ఇంటి నుంచి వెళ్లిపోయి కామారెడ్డిలోని తన స్నేహితురాలి ఇంట్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు, బాలికకు ఫోన్ చేసి బస్టాండ్‌లో కలిశాడు. అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు తన వద్దే ఉంచుకున్నాడు.

బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ఈ ఘటనను గుర్తించారు. నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, పక్కా ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, నిందితుడిని దోషిగా నిర్ధారించి పై విధంగా శిక్ష ఖరారు చేసింది.