‘‘సంజయ్‌ కాదు.. మీ భర్త రాజీవ్‌గాంధీ ఒకరోజు ప్రధానమంత్రి అవుతారు’’.. దశాబ్దాల క్రితం ఓ హస్తసాముద్రికుడు చెప్పిన మాటలివి. అప్పట్లో సరదాగా అనిపించిన ఈ సంఘటన.. ఆ తర్వాత చోటుచేసుకున్న వరుస విషాదాల నేపథ్యంలో తనను ఆలోచనలో పడేసిందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ వెల్లడించారు. తన జ్ఞాపకాలతో రాసిన ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకంలో ఈ విషయాలను ఆమె గుర్తుచేసుకున్నారు. నవంబర్‌ 10న ఈ పుస్తకం విడుదలైంది.

1970వ దశకం చివర్లో ఇందిరాగాంధీ కుటుంబం ఢిల్లీలోని విల్లింగ్‌డన్‌ క్రెసెంట్‌లో ఉన్న 12వ నంబర్‌ బంగ్లాలో నివసించేది. 1977లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కుటుంబ స్నేహితుడు మహమ్మద్‌ యూనస్‌ ఖాళీ చేయించిన నాలుగు గదుల ఇంటికి ఇందిరాగాంధీ మారారు. ఆ సమయంలో రాజీవ్‌గాంధీ వాణిజ్య విమాన పైలట్‌గా పనిచేస్తుండగా, రాజకీయాలపై ఆసక్తి చూపేవారు కాదు. సంజయ్‌గాంధీ మాత్రం తల్లి రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందారు.

ఆ ఇంట్లో జరిగిన ఓ విచిత్ర సంఘటనను సోనియా తన పుస్తకంలో వివరించారు. తెల్లటి దుస్తులు ధరించిన ఓ లావుపాటి వ్యక్తి అనుమతి లేకుండా తమ ఇంటి భాగంలోకి వచ్చి, తన అరచేతి ముద్ర ఉన్న కాగితం చూపిస్తూ భవిష్యత్తు చెబుతానని పట్టుబట్టాడని పేర్కొన్నారు. జ్యోతిష్యాన్ని నమ్మనని, తనకు భవిష్యత్తు తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్లిపోవాలని కోరినా అతడు వినలేదన్నారు.

దీంతో కోపంతో అతడిని బయటకు పంపేందుకు ప్రయత్నించగా.. వెనక్కి తిరిగి వెళ్తూ ‘‘సంజయ్‌ కాదు.. మీ భర్త రాజీవ్‌గాంధీ ఒకరోజు ప్రధాని అవుతారు’’ అని గట్టిగా చెప్పాడని సోనియా గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రాజీవ్‌ చేతిపై సిరా ముద్ర కనిపించడంతో ఆశ్చర్యపోయానన్నారు. అప్పటికే ఆ వ్యక్తి రాజీవ్‌ చేతిని చూసి భవిష్యత్తు చెప్పాడని, రాజీవ్‌ మాత్రం దాన్ని సరదాగా తీసుకున్నారని తెలిపారు.

1980 జూన్‌లో విమాన ప్రమాదంలో సంజయ్‌గాంధీ మరణించారు. 1984 అక్టోబర్‌లో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే రాజీవ్‌గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లోకి రావద్దని సోనియా కన్నీళ్లతో వేడుకున్నప్పటికీ, బాధ్యతను స్వీకరించారని పుస్తకంలో పేర్కొన్నారు. ‘‘వాళ్లు ఎలాగూ నన్ను చంపేస్తారు’’ అని రాజీవ్‌ తనతో అన్నట్లు ఆమె రాశారు.

రాజీవ్‌ 41వ పుట్టినరోజు సందర్భంగా 1985 ఆగస్టులో జరిగిన విందు సమయంలోనూ ఓ విషాద వార్త వచ్చిందని సోనియా గుర్తుచేసుకున్నారు. పంజాబ్‌లో అకాలీ నేత హర్చంద్‌ సింగ్‌ లాంగోవాల్‌ హత్యకు గురయ్యారన్న సమాచారం అందిందన్నారు. ఆ ఘటనను విషాదంతోపాటు అపశకునంగా భావించానని, రాజీవ్‌ పుట్టినరోజునే ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించానని రాశారు.

1990 ఫిబ్రవరి 5న రాజీవ్‌, సోనియా దంపతులు 10 జన్‌పథ్‌ నివాసానికి మారారు. ఆ ఇల్లు అచ్చిరాదని రాజీవ్‌ సహచరులు కొందరు హెచ్చరించినా, తామిద్దరం మూఢనమ్మకాలను విశ్వసించక ఆ మాటలను పట్టించుకోలేదని సోనియా తెలిపారు. ఆ ఇంటి వెనుక ఏనుగు సమాధిగా భావించే ఓ మట్టిదిబ్బ, ఎదురుగా ఓ సూఫీ పీర్‌ సమాధి ఉన్నాయని పుస్తకంలో ప్రస్తావించారు. ఆ ఇంటికి మారిన 15 నెలలకే.. 1991 మేలో రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.