రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాది హేమంత్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ‘పల్మనరీ ఎంబాలిజం’ అనే తీవ్రమైన సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఏర్పడటంతో వైద్యులు అతడికి ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

రెండు రోజుల క్రితం హేమంత్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆ ఆయాసంలోనే అతడు ఆసుపత్రి బెడ్ పైనుంచి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు అతనికి అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తీసిన సీటీ స్కాన్‌లో ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినట్లు స్పష్టమైంది. దీనితో అతడికి వెంటనే అవసరమైన మందులు, చికిత్స ప్రారంభించారు.

సాధారణంగా పెద్ద సర్జరీల తర్వాత వచ్చే అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల్లో ఈ ‘పల్మనరీ ఎంబాలిజం’ ఒకటని వైద్యులు చెబుతున్నారు. గతంలో పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌కు కుడికాలు తొలగింపు సర్జరీ జరిగింది. ఈ సమస్య వల్ల శరీరంలో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, ఇది ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక ప్రత్యేక వైద్య బృందం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.