బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు నగదు రూపంలో ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు పంపాలంటే ఎంత పంపొచ్చు? ఏటీఎం లేదా బ్యాంకు ప్రతినిధుల ద్వారా డబ్బు పంపితే పరిమితి ఎంత? ఇలాంటి అంశాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. గతంలో ఉన్న నగదు బదిలీ పరిమితులను కొనసాగిస్తూనే, మోసాలను అరికట్టేందుకు కొన్ని భద్రతా చర్యలను తప్పనిసరి చేసింది.

ఒక వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకపోయినా, బ్యాంకు శాఖకు వెళ్లి నగదు రూపంలో ఇతరుల ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఇందుకు నెఫ్ట్‌ (NEFT) సేవను ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.50 వేల వరకు నగదు పంపవచ్చు. ఈ పరిమితిని ఆర్బీఐ కొనసాగించింది.

బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు బిజినెస్‌ కరస్పాండెంట్లు (బ్యాంకు తరఫున గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో సేవలందించే ప్రతినిధులు), ఏటీఎంలు లేదా అనుమతించిన ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు పంపవచ్చు. అయితే ఈ విధానంలో ఒక్కసారి రూ.5 వేలకు మించి పంపకూడదు. ఒక వ్యక్తి నెల మొత్తంలో పంపే డబ్బు రూ.25 వేలకు మించకూడదు.

డబ్బు పంపే వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉన్నా, డబ్బు తీసుకునే వ్యక్తికి ఖాతా లేకపోవచ్చు. అలాంటి వారికి ఏటీఎంలు, బ్యాంకు ప్రతినిధులు లేదా ఇతర అనుమతించిన మార్గాల ద్వారా నగదు అందించవచ్చు. అయితే ఒక్కసారి గరిష్ఠంగా రూ.10 వేలు మాత్రమే పంపాలి. ఒక వ్యక్తికి నెలలో ఇలా అందించే మొత్తం రూ.25 వేలకు మించకూడదు.

డబ్బు పంపే వ్యక్తి మొబైల్‌ నంబర్‌ను బ్యాంకు ధ్రువీకరించాలి. కేవైసీ నిబంధనల ప్రకారం గుర్తింపు పత్రాన్ని కూడా నమోదు చేయాలి. నగదు రూపంలో పంపిన డబ్బును గుర్తించేందుకు నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ లావాదేవీల వివరాల్లో ప్రత్యేక సంకేతం ఉండాలి. డబ్బు పంపిన వ్యక్తి వివరాలను కూడా బ్యాంకులు నమోదు చేయాలి.

ఒక బ్యాంకు ఖాతాలోకి అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అవుతున్నా, అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నా బ్యాంకులు వెంటనే పరిశీలించాలి. అనుమానం బలపడితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. డబ్బు బదిలీలు వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. బ్యాంకుల మధ్య నగదు లావాదేవీలు ఆర్బీఐ ఆమోదించిన వ్యవస్థల ద్వారానే జరగాలి.

ఈ నిబంధనలు దేశంలోని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతోపాటు సంబంధిత చెల్లింపు సేవల సంస్థలకు వర్తిస్తాయి. ఒక కార్డు నుంచి మరో కార్డుకు చేసే నగదు బదిలీలు ఈ నిబంధనల పరిధిలోకి రావు.