మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి పెట్టిన పార్టీ 'పరివర్తన పార్టీ' కాదని, అది 'అపరివర్తన అవినీతి పార్టీ' అని ఆయన ఎద్దేవా చేశారు. దాచుకున్న నల్లధనాన్ని కాపాడుకోవడానికే ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీని స్థాపించారని ఆరోపించారు.

గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చారని కేఏ పాల్ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు విస్తరించి ఉన్న ఆయన ఆస్తులను, దోచుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంత భారీగా ఆస్తులు ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అంతేకాకుండా, వైసీపీ అధినేత జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకే, ఇతర రాజకీయ శక్తుల కోసమే విజయసాయిరెడ్డి ఈ కొత్త పార్టీని ప్రారంభించారని కేఏ పాల్ ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఒకే వర్గం ఆధిపత్యం చెలాయిస్తోందని, రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు, 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం ఎప్పుడు దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు.