ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడ పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

వివరాల్లోకి వెళితే, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు.

కొందరు కార్యకర్తలు గేట్లు దూకి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో కౌంటింగ్ కేంద్రం వద్ద కాసేపు గందరగోళం నెలకొంది.