రాష్ట్రంలోని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ప్రభుత్వం అక్రమాలకు, రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. గన్నవరం జడ్పీ హైస్కూల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తేడాగా వస్తాయనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే నామినేషన్లు వేయనివ్వలేదు. వేసినవి రిజెక్ట్ చేశారు. బూత్ ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ చేసుకుంటున్నారు" అని వంశీ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు.

"సంపద సృష్టిస్తాం, అందరికీ పంచుతాం అని హామీలు ఇచ్చారు. 30 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు" అని వంశీ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఎవరైనా ఐదేళ్ల పాటు కేవలం టెంపరరీ కస్టోడియన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎక్కువ కాలం ఆపలేరని, ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.