దీపావళి సెలవు తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో కళ్లు చెదిరేలా దూసుకెళ్తున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. కేవలం 45 నిమిషాల్లోనే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్‌ ఏకంగా 1,300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 50 కూడా ఒక శాతానికి పైగా ఎగబాకింది.

ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5,06,41,936 కోట్లుగా ఉంది. ఉదయం 10 గంటల సమయానికి అది రూ.5,12,45,010 కోట్లకు చేరింది. అంటే కేవలం 45 నిమిషాల్లోనే రూ.6,03,074 కోట్ల సంపద పెరిగింది. దీపావళి సెలవు తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో లాభాలతో ప్రారంభం కావడం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది.

ఈ ర్యాలీకి ప్రధాన కారణాల్లో ముడిచమురు ధరల తగ్గుదల ఒకటి. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బ్యారెల్‌ ధర 100 డాలర్లకు పైగా చేరగా.. ఇటీవల గణనీయంగా తగ్గింది. మంగళవారం ఓ దశలో 90 డాలర్ల దిగువకు పడిపోయింది. భారత్‌ తన చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ధరలు తగ్గితే దిగుమతి భారం, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. కంపెనీల ఉత్పత్తి, రవాణా ఖర్చులపైనా ప్రభావం పడుతుంది.

ఇటీవల భారత మార్కెట్లలో అమ్మకాలకు దిగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మళ్లీ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఇది మార్కెట్లకు బలాన్నిస్తోంది. మరోవైపు పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటం కూడా మదుపర్లలో నమ్మకాన్ని పెంచింది. నవంబర్‌లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 9 శాతం లాభపడటం గమనార్హం.

ముడిచమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, పశ్చిమాసియాలో పరిణామాలను ఇన్వెస్టర్లు గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరిగినా, చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడినా ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, కృత్రిమ మేధ రంగంలో పరిణామాలు కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.