భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ సినిమా మరో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సాయిపల్లవి, రవిదూబే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో 2027 ఆస్కార్‌ అవార్డుల పరిశీలనకు చిత్రాన్ని సమర్పించినట్లు సమాచారం.

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. 99వ అకాడమీ అవార్డుల కోసం ‘రామాయణ: పార్ట్‌ 1’ను పరిశీలనకు పంపించారు. అయితే, అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో భారత అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ ఎంపికైంది. దీంతో ‘రామాయణ’కు ఆస్కార్‌ అవకాశాలు లేవని భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతర్జాతీయ చలనచిత్ర విభాగం మినహా ఇతర విభాగాల్లో పోటీకి దేశ అధికారిక ఎంపికతో సంబంధం లేకుండా సినిమాలు తమంతట తాముగా దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఇందుకు అకాడమీ కొన్ని నిబంధనలు విధించింది. అమెరికాలో అర్హత కలిగిన ఓ నగరంలో వరుసగా కనీసం ఏడు రోజుల పాటు సినిమా ప్రదర్శితమై ఉండాలి. దీంతోపాటు అకాడమీ నిర్దేశించిన ఇతర అర్హతలను కూడా పూర్తి చేయాలి. ఈ షరతులు నెరవేరిన తర్వాత చిత్ర నిర్మాతలు లేదా పంపిణీదారులు అవసరమైన పత్రాలను సమర్పించి అవార్డుల పరిశీలనకు సినిమాను పంపవచ్చు. అందువల్ల భారత అధికారిక ఎంట్రీగా మరో చిత్రం ఎంపికైనప్పటికీ ‘రామాయణ’ ఇతర విభాగాల్లో పోటీకి ప్రయత్నించవచ్చు.

అంతర్జాతీయ చలనచిత్ర విభాగానికి మాత్రం ప్రత్యేక విధానం ఉంటుంది. సాధారణంగా ప్రతి దేశం నుంచి ఒక సినిమాను మాత్రమే అధికారికంగా ఎంపిక చేసి పంపిస్తారు. అయితే అకాడమీ నిబంధనల్లో ఇటీవల మార్పులు చేసింది. కొన్ని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో గుర్తింపు పొందిన అవార్డులు గెలుచుకున్న సినిమాలకు దేశ అధికారిక ఎంపిక లేకున్నా ఈ విభాగంలో అర్హత పొందే అవకాశం కల్పించింది. నాగ భాషలో రూపొందిన ‘అంగ్‌’ సినిమా ఇందుకు ఉదాహరణ. 2026 టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్‌ అవార్డు గెలుచుకోవడంతో ఆస్కార్‌ పరిశీలనకు అర్హత సాధించింది.