నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా హోంగార్డు తన భర్త చేతిలోనే హత్యకు గురైనట్టు అనుమానిస్తున్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మెహబూబ్ బీని ఆమె భర్త సతీశ్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వీరిది కులాంతర వివాహం అని సమాచారం. సతీశ్ గతంలో హోంగార్డుగా పనిచేసినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వన్-టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.