హైదరాబాద్‌లో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి (హెచ్ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌బీ) అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో తాగునీటిని ఫ్లోర్ శుభ్రం చేయడానికి వినియోగించినందుకు గాను ప్రముఖ సంస్థ అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.20,000 జరిమానా విధించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం.70లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న అక్షయకల్ప ప్రాంగణంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటిని నేల శుభ్రపరచడానికి వాడుతున్నట్లు గుర్తించి, వెంటనే జరిమానా విధించారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఆ సంస్థ మురుగునీటి కనెక్షన్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.

రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి తనిఖీలను ముమ్మరం చేసింది. తాగునీటిని కేవలం తాగడానికి, వంట అవసరాలకు మాత్రమే వినియోగించాలని నగరవాసులకు, వాణిజ్య సంస్థలకు స్పష్టం చేసింది. ఫ్లోర్ క్లీనింగ్, వాహనాలు కడగడం, తోటపని, నిర్మాణ పనులకు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నుంచి సరఫరా అయ్యే ట్రీటెడ్ వాటర్‌ను వాడుకోవాలని సూచించింది.

నగరవ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా తాగునీటి వృథా జరుగుతుంటే, దానికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలతో 99499 30003 అనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.