మేడ్చల్ జిల్లా కొంపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గౌరీ శంకర్ వరప్రసాద్ (52) షామీర్‌పేట పరిధిలో సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ముంచింతలపల్లి సమీపంలోని లక్ష్మాపూర్ చెరువు కట్ట వద్ద ఆయన గుర్తుతెలియని పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

షామీర్‌పేట పోలీసుల వివరాల ప్రకారం.. గౌరీ శంకర్ వరప్రసాద్ గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. అప్పులు పెరిగిపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడంతో గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయంగా పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేయాలని వరప్రసాద్ భావించారు. ఆ వ్యాపారానికి తగిన స్థలాన్ని వెతికే క్రమంలో ఆయన తన ద్విచక్ర వాహనంపై షామీర్‌పేట పరిసర ప్రాంతాలకు వెళ్లారు. లక్ష్మాపూర్ చెరువు కట్ట సమీపంలో ఆయన సంచరిస్తుండటాన్ని స్థానిక గ్రామస్తులు చివరిసారిగా గమనించారు. ఆ తర్వాత తీవ్ర నిరాశతో ఆయన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగినట్లు తెలుస్తోంది.

చెరువు కట్ట వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వరప్రసాద్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న శామీర్‌పేట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.