హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట నాన్‌టీచింగ్ ఉద్యోగులు చేపట్టిన మహాధర్నాకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన ఈ ఆందోళనలో ఆమె స్వయంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించిన కవిత... రాష్ట్ర ప్రభుత్వంపై, విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశ్వవిద్యాలయ పరిపాలన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఉద్యోగులను ఓయూ వీసీ పట్టించుకోవడం లేదని, ఆయన ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దాదాపు ఏడాదిన్నర కాలంగా ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని కవిత అన్నారు. సుమారు 35 ఏళ్లుగా ఉద్యోగులు వివిధ ప్రభుత్వాల హయాంలో దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. నాన్‌టీచింగ్ సిబ్బంది పోరాటానికి పర్మినెంట్ ఉద్యోగులు కూడా మద్దతు తెలపడాన్ని ఆమె ప్రశంసించారు. విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, నాన్‌టీచింగ్ సిబ్బంది న్యాయమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్లు ఎక్కడ? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. నిధులు మంజూరు చేస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని తప్పుబట్టారు.