ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ సరికొత్త ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ వ్యవస్థలను వాస్తవ వ్యాపార రంగంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా 'ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీరింగ్ (ఎఫ్డీఈ) ప్రాక్టీషనర్ ప్రోగ్రామ్' పేరిట 3 నెలల ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

ఈ కోర్సు 2026 డిసెంబర్ 5న ప్రారంభం కానుంది. మొత్తం 13 వారాల పాటు సాగే ఈ ప్రోగ్రామ్‌లో 52 ఆన్‌లైన్ సెషన్లు (156 గంటల లైవ్ క్లాసులు) ఉంటాయి. ఆన్‌లైన్ తరగతులతో పాటు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మూడు ఐచ్ఛిక (ఆప్షనల్) క్యాంపస్ సెషన్లలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ailaunchpad.cse.iith.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏఐ ప్రాజెక్టులను కేవలం ప్రయోగాల దశకే పరిమితం చేయకుండా, వాటిని కంపెనీల సాఫ్ట్‌వేర్, డేటాబేస్, వ్యాపార ప్రక్రియలతో ఎలా అనుసంధానించాలో ఈ కోర్సులో సమగ్రంగా నేర్పిస్తారు. ఏజెంటిక్ ఏఐ వ్యవస్థలు, వర్క్‌ఫ్లో ఆటోమేషన్, ఏపీఐల అనుసంధానం వంటి కీలక అంశాలపై ప్రాక్టికల్ ప్రాజెక్ట్‌ల ద్వారా శిక్షణ ఇస్తారు.

ఐఐటీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ ప్రవీణ్ తమ్మన, డాక్టర్ ఆశిష్ మిశ్రా, డాక్టర్ అనుపమ్ సంఘీ, డాక్టర్ అభిజిత్ దాస్ ఈ ప్రోగ్రామ్‌కు నేతృత్వం వహిస్తుండగా, ఎన్.వి.ఎస్.ఎస్. కౌండిన్య ఇండస్ట్రీ లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్, డేటా ఇంజనీరింగ్ రంగాల్లో 2 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు ఈ కోర్సు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ తెలిపింది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి ఐఐటీ హైదరాబాద్ ధ్రువపత్రం అందజేస్తుంది.