భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్‌లో మంగళవారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యం కొనసాగుతోంది.

ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో టాస్‌ ఆలస్యమైంది. పలుసార్లు టాస్‌ను వాయిదా వేశారు. మధ్యలో కాసేపు వరుణుడు విరామం ఇవ్వడంతో టాస్‌ వరకు మార్గం సుగమమైంది. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. వరుసగా మూడోసారి టాస్‌ గెలిచిన గిల్‌.. గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని నిర్ణయించాడు.

మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. కాసేపటికే అది మరింత పెరగడంతో మైదానాన్ని తిరిగి కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లు కూడా డ్రెస్సింగ్‌ రూములకు చేరుకున్నారు.

న్యూజిలాండ్‌ కాలమానం ప్రకారం రాత్రి 7.50 గంటలకు 20 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించేందుకు తుది గడువు ఉంది. అప్పటికి ఇంకా 70 నిమిషాల సమయం ఉన్నప్పటికీ వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మూడో వన్డే రద్దుతో భారత్‌కు సిరీస్‌లో 2-0 ఆధిక్యం కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం ఇరు జట్లు టౌరంగాకు వెళ్లనున్నాయి. నాలుగో వన్డే నవంబర్‌ 13న బే ఓవల్‌లో, ఐదో వన్డే నవంబర్‌ 15న జరగనున్నాయి.