ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా సింధు ఎన్నికైన సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

"రెండు పర్యాయాలు ఒలింపిక్ పతకాలు సాధించి, బ్యాడ్మింటన్ కోర్టులో నవతరానికి స్ఫూర్తిగా నిలిచిన పీవీ సింధు.. ఇప్పుడు భారత క్రీడారంగంలో కీలక నాయకత్వ బాధ్యతలను చేపట్టడం గర్వకారణం. సింధూ, మీ విజయాలను చూసి ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది" అని లోకేశ్ తన సందేశంలో కొనియాడారు. క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆమె, ఇప్పుడు క్రీడా పరిపాలనలోనూ విజయవంతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కీలక బాధ్యతల్లో సింధు ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. సింధు ఈ నూతన పదవిని చేపట్టడం భారత క్రీడారంగానికి శుభపరిణామమని పలువురు క్రీడాభిమానులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.