నటి రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, ఈసారి వ్యక్తిగత విషయాల వల్ల కాకుండా, ఒక సామాజిక అంశంపై తనదైన శైలిలో స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీపావళి పండుగ ముగిసి రోజులు గడుస్తున్నా, కొందరు ఇంకా అర్ధరాత్రి వేళల్లో టపాసులు పేల్చడంపై ఆమె తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

గత మూడు రోజులుగా రాత్రి 11 గంటలకు కూడా టపాసులు కాలుస్తున్నారని, తన స్నేహితులు చెప్పిన ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 1, 2, 3 గంటల వరకు కూడా ఈ శబ్దాలు కొనసాగుతున్నాయని రేణూ దేశాయ్ తన పోస్టులో పేర్కొన్నారు. "అసలు ఏ పండుగ కోసం ఈ సంబరాలు? దయచేసి రాత్రి 9 గంటలకు, మహా అయితే 10 గంటలకల్లా ఈ వేడుకలు ముగించండి" అని ఆమె విజ్ఞప్తి చేశారు. తన ఆందోళన పర్యావరణం గురించి కాదని, సాటి మనుషుల పట్ల సానుభూతితో ఆలోచించాలని ఆమె స్పష్టం చేశారు.

ఈ భారీ శబ్దాల వల్ల నవజాత శిశువులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. "కొద్దిసేపటి తాత్కాలిక ఆనందం కోసం ఇతరుల బాధను, కష్టాన్ని పట్టించుకోనంత స్వార్థపరులుగా, మూర్ఖులుగా మనం మారిపోయాం" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీపావళి రోజున తాను ఈ విషయంపై మాట్లాడితే 'హిందూ వ్యతిరేకి' అనే ముద్ర వేస్తారనే ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నానని ఆమె వివరించారు.

ఏపీ డిప్యూటీ సీఎం, తన మాజీ భర్త పవన్ కల్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడాకుల వార్తలు ఓవైపు హోరెత్తుతుండగా, మరోవైపు రేణూ దేశాయ్ ఈ సామాజిక అంశంపై పోస్ట్ చేయడం గమనార్హం. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల మధ్య, ఆమె ఒక సామాజిక బాధ్యతతో చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పండుగల పేరుతో శబ్ద కాలుష్యం సృష్టించడంపై మరోసారి ఆలోచించాల్సిన అవసరాన్ని రేణూ దేశాయ్ పోస్ట్ గుర్తుచేసింది.