ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరంగా స్పందించారు.  

పవన్ కల్యాణ్ వివాహాలు, విడాకులు అనేవి పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని, వాటి గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విడాకుల అంశంపై విలేకరులు ప్రశ్నించగా, అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు.

దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అంబటి రాంబాబుపై గతంలో కేసు నమోదైంది. 2026 జూలై 15న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముద్రగడ భౌతికకాయానికి పోలీసులు ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం ఇచ్చేందుకు ప్రయత్నించగా, వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసు విధులను అడ్డుకున్నారంటూ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసులు అందుకున్న అంబటి రాంబాబు ఈరోజు విచారణకు హాజరయ్యారు. పోలీసులు సుమారు గంటన్నర పాటు ఆయనను విచారించారు. అనంతరం బయటకు వచ్చిన అంబటి మాట్లాడుతూ.. తాను పోలీస్ స్టేషన్‌కు హాజరుకావడం కొత్తేమీ కాదన్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులు వద్దని చెప్పినప్పటికీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి భౌతికకాయం వద్ద గౌరవ వందనం చేసేందుకు ప్రయత్నించారని, దాన్ని తాము అడ్డుకున్నామని వివరించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, అది ఆయన వ్యక్తిగత వ్యవహారమని, దానిపై స్పందించేది లేదని తేల్చిచెప్పారు.