బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సినీ ప్రముఖులు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడే ప్రాంతాలకు వెళ్లవద్దని, అభిమానులతో జనసమూహాల మధ్య కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖుల భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ సూచనలు జారీ చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు.

కొన్ని వారాల క్రితం ముంబైలో టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత పలువురు సినీ ప్రముఖుల ఇళ్ల వద్ద కూడా దుండగులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు సినీ ప్రముఖులకు భద్రతాపరమైన సూచనలు జారీ చేశారు.

ఇటీవల బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తన జుహులోని నివాసం 'జల్సా' వెలుపల అభిమానులకు అభివాదం చేశారు. అయితే బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దం వెనుక ఉండి అభిమానులకు అభివాదం చేయడం గమనార్హం. మరోవైపు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తుల నుంచి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నటీనటులకు సూచించారు.