స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు నిత్య జీవితంలో భాగమైన ఈ డిజిటల్ యుగంలో చాలామంది ఇప్పటికీ అందమైన నోట్‌బుక్‌లు, ఖరీదైన పెన్నులు కొనడం ఆపరు. ఇది కేవలం పాత అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక బలమైన మానసిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా, పెన్ను, కాగితం వాడకం వ్యక్తిగత గుర్తింపును, సృజనాత్మకతను చాటుకునే మార్గంగా మారిందని విశ్లేషిస్తున్నారు.

ఈ అలవాటు వెనుక ఉన్న మనస్తత్వాన్ని 'సింబాలిక్ సెల్ఫ్-కంప్లీషన్ థియరీ'తో ముడిపెడుతున్నారు. మనస్తత్వవేత్తలు రాబర్ట్ విక్‌లండ్, పీటర్ గొల్విట్‌జర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం.. వ్యక్తులు తమకు ముఖ్యమైన గుర్తింపును, వ్యక్తిత్వాన్ని కొన్ని వస్తువుల ద్వారా పటిష్టం చేసుకుంటారు. 

ఉదాహరణకు, ఒక ఖరీదైన పెన్ను, నాణ్యమైన నోట్‌బుక్‌ను ఉపయోగించడం ద్వారా తమను తాము ఒక రచయితగా, వ్యవస్థీకృత వ్యక్తిగా లేదా సౌందర్య స్పృహ ఉన్న వ్యక్తిగా భావించుకుంటారు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.

అంతేకాకుండా చేతిరాతకు, జ్ఞాపకశక్తికి మధ్య బలమైన సంబంధం ఉందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. టోక్యో విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనం ప్రకారం టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో టైప్ చేయడంతో పోలిస్తే, కాగితంపై చేతితో రాయడం వల్ల మెదడులోని జ్ఞాపకశక్తి, భాషకు సంబంధించిన భాగాలు మరింత చురుగ్గా పనిచేస్తాయని తేలింది. 

చేతితో రాసేటప్పుడు కేవలం సమాచారాన్ని నమోదు చేయడమే కాకుండా, దాన్ని లోతుగా విశ్లేషించే ప్రక్రియ జరుగుతుంది. ఇది విషయాలను బాగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ అలవాటుకు మరో కారణం స్పర్శ అనుభూతి, గత స్మృతులు. 

కాగితంపై పెన్నుతో రాస్తున్నప్పుడు కలిగే అనుభూతి చాలామందికి మానసిక సంతృప్తిని ఇస్తుంది. నిరంతర డిజిటల్ నోటిఫికేషన్లు, పరధ్యానాల నుంచి దృష్టి మరల్చి, ఏకాగ్రతతో ఒక పనిపై దృష్టి పెట్టడానికి ఇది ఒక మంచి మార్గంగా పనిచేస్తుంది. అందువల్ల ఇది టెక్నాలజీపై వ్యతిరేకత కాదు, తమకోసం తాము స్పృహతో తీసుకునే ఒక సానుకూల నిర్ణయంగా భావించవచ్చు.