బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఎల్‌ఏసీఎంఏ ఆర్ట్ + ఫిల్మ్ గాలాకు హాజరైన తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించాడు. నవంబర్ 7న జరిగిన ఈ 15వ వార్షికోత్సవ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఈ కార్యక్రమానికి హృతిక్ ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ‘బ్రునెల్లో కుసినెల్లి’ డిజైన్ చేసిన డార్క్ బ్లూ టక్సెడోలో హాజరయ్యాడు. రెడ్ కార్పెట్‌పై ఫొటోగ్రాఫర్లకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి, భారతీయ సంస్కృతిని చాటాడు. ఈ దృశ్యాలు, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో సహ-చైర్‌గా వ్యవహరించే ఈ గాలా ఆర్ట్, సినిమా రంగాలను ప్రోత్సహించడానికి నిధులు సేకరిస్తుంది. ఈ ఏడాది ఈ వేడుక ద్వారా దాదాపు 70 లక్షల డాలర్లు సమీకరించారు. ఈ ఈవెంట్‌లో హృతిక్‌తో పాటు టామ్ హ్యాంక్స్, కిమ్ కర్దాషియన్, ఆండ్రూ గార్‌ఫీల్డ్, తిమోథీ చలమెట్ వంటి అనేక మంది హాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో హృతిక్‌ను భారత సంతతికి చెందిన నిర్మాత కవితా గుప్తా హోస్ట్ చేశారు. ‘డ్యూన్’ చిత్ర దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్, నటి నికోల్ కిడ్‌మాన్‌లతో హృతిక్ దిగిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక సినిమాల విషయానికొస్తే, ఇటీవల ‘వార్ 2’తో విజయం సాధించిన హృతిక్, త్వరలో ‘క్రిష్ 4’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.