మనుషులు గంజాయిని మత్తు కోసం ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇప్పటివరకు ఉన్న అంచనాలను సవాలు చేస్తూ ఓ కొత్త అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుమారు 2,800 ఏళ్ల క్రితమే సైబీరియాలోని పురాతన సంచార జాతి ప్రజలు గంజాయిని మత్తు కోసం ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో భావించిన దానికంటే 300 ఏళ్లు ముందు నుంచే గంజాయి వినియోగం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

దక్షిణ సైబీరియాలోని ఉయుక్‌ లోయలో ఉన్న ‘టున్నుంగ్‌-1’ అనే పురాతన సమాధి ప్రాంతంలో ఈ ఆధారాలు లభించాయి. గుర్రాలపై సంచరిస్తూ యూరేషియా గడ్డి మైదానాల్లో జీవించిన స్కైథియన్లకు చెందిన ఈ సమాధిలో బంగారు ఆభరణాలు, జంతువుల ఆకారంలోని ప్రతిమలు, బాకులు, మానవ అవశేషాలతో పాటు వందల సంఖ్యలో గంజాయి విత్తనాలను గుర్తించారు. దీంతో అక్కడ లభించిన వెంట్రుకలను పరిశీలించిన శాస్త్రవేత్తలకు గంజాయి వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి.

వెంట్రుకల నమూనాల్లో గంజాయిలో ఉండే మత్తు కలిగించే ప్రధాన రసాయనమైన టెట్రాహైడ్రోకన్నాబినాల్‌ (టీహెచ్‌సీ), కన్నాబినాల్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ పరిశోధన వివరాలు ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జర్మనీలోని జెనా నగరంలో ఉన్న మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోఆంత్రోపాలజీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త గినో కాస్పరి నేతృత్వంలోని బృందం 2017 నుంచి ఈ సమాధి ప్రాంతంలో తవ్వకాలు చేపడుతోంది.

సమాధిలో గంజాయి వినియోగం సాధారణ అలవాటుగా కాకుండా ఆచారాల్లో భాగంగా జరిగి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. షమానిక్‌ విశ్వాసాలు, ఆధ్యాత్మిక కర్మకాండలతో దీనికి సంబంధం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సమాధిలో బలి ఇచ్చినట్లు భావిస్తున్న డజన్ల కొద్దీ గుర్రాలు, మానవ బలి ఆనవాళ్లు కూడా ఉండటంతో.. బలికి ముందు బాధితులను మత్తులోకి పంపేందుకు గంజాయిని ఉపయోగించి ఉండొచ్చన్న మరో అభిప్రాయాన్ని కాస్పరి వెల్లడించారు. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపారు.

తూర్పు ఆసియాలో కనీసం 6,000 ఏళ్ల క్రితమే గంజాయిని నూనె సమృద్ధిగా ఉండే విత్తనాల కోసం సాగు చేసినట్లు ఆధారాలున్నాయి. అయితే దాని మత్తు కలిగించే లక్షణాలను మనుషులు ఎప్పటి నుంచి వినియోగించారన్నది ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. తాజా పరిశోధన ఈ విషయంలో కొత్త ఆధారాన్ని అందిస్తోంది.