దీపావళి పండుగ అంటేనే దీపాల వెలుగులు, ఆత్మీయుల సందళ్లు, సంతోషాల కలబోత. అయితే, ప్రతి ఏటా ఈ వేడుకలతో పాటు వాయు కాలుష్యం అనే తీవ్రమైన సమస్య కూడా మనల్ని వెన్నాడుతూ ఉంటుంది. టపాసుల వాడకం వల్ల అకస్మాత్తుగా పెరిగిపోయే కాలుష్యం, ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై అవగాహన పెరుగుతోంది. 

ఈ నేపథ్యంలో సంప్రదాయ టపాసులకు ప్రత్యామ్నాయంగా 'గ్రీన్ క్రాకర్స్' తెరపైకి వచ్చాయి. అయితే, ఇవి నిజంగా మన ఊపిరితిత్తులకు సురక్షితమేనా? ముఖ్యంగా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి వీటితో ప్రమాదం లేదా? అనే ప్రశ్నలకు నిపుణులు ఆందోళనకరమైన సమాధానాలే ఇస్తున్నారు.

తక్కువ కాలుష్యం అంటే.. సురక్షితం కాదు!
సంప్రదాయ టపాసులతో పోలిస్తే పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు మెరుగైన రసాయనాలతో గ్రీన్ క్రాకర్స్‌ను అభివృద్ధి చేశారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని నీరి (ఎన్ఈఈఆర్ఐ) ప్రకారం ఈ టపాసులు కనీసం 30% తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. బేరియం వంటి హానికారక లోహాలను తొలగించడం మంచి పరిణామమే అయినా, గ్రీన్ క్రాకర్స్ పూర్తిగా కాలుష్య రహితం కాదని గుర్తించాలి.

వీటిని కాల్చినప్పుడు కూడా పర్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5, PM10), సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటివి గాలిలోకి విడుదలవుతాయి. ముఖ్యంగా, అతి సూక్ష్మమైన ధూళి కణాలు శ్వాస వ్యవస్థలోకి లోతుగా చొచ్చుకుపోయి, ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీసి, వాపును ప్రేరేపిస్తాయి. కాబట్టి, గ్రీన్ క్రాకర్స్ ఉద్గారాలను తగ్గించినా, శ్వాసకోశ ఆరోగ్యానికి పూర్తి సురక్షితం అని భావించడం పొరపాటే అవుతుంది.

అధిక కాలుష్య నగరాల్లో మరింత ప్రమాదం
టపాసుల ప్రభావాన్ని విడిగా చూడలేం. ఇప్పటికే భారతదేశంలోని అనేక నగరాలు తీవ్రమైన వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు, నిర్మాణ రంగం నుంచి వెలువడే ధూళి, చెత్తను కాల్చడం వంటివి గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. చలికాలంలో గాలిలో తేమ పెరిగి, కాలుష్య కారకాలు భూమికి దగ్గరగా పేరుకుపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి టపాసుల పొగ తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది. తక్కువ ఉద్గారాలు వెదజల్లే గ్రీన్ క్రాకర్స్ అయినా సరే, లక్షలాదిగా ఒకే సమయంలో పేల్చినప్పుడు గాలిలో కాలుష్య తీవ్రత భారీగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యవంతులపై తాత్కాలిక ప్రభావం చూపితే, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తుంది.

శ్వాసకోశ వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం
దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారి ఊపిరితిత్తుల పనితీరు ఇప్పటికే పరిమితులకు దగ్గరగా ఉంటుంది. ఇలాంటి సమయంలో టపాసుల పొగ వారి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.

ఆస్తమా: ఆస్తమా రోగుల వాయు నాళాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. టపాసుల పొగ పీల్చడం వల్ల వాయు నాళాలు సంకోచించి, ఉబ్బసం, దగ్గు, ఆయాసం తీవ్రమవుతాయి. దీనివల్ల ఎమర్జెన్సీ చికిత్స అవసరపడవచ్చు.
సీవోపీడీ: ఈ వ్యాధిగ్రస్తులకు ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. టపాసుల పొగ వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారి, ఆయాసం పెరిగి ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావచ్చు.
ఇతర వ్యాధులు: బ్రాంకిఎక్టసిస్, ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్, పల్మనరీ హైపర్‌టెన్షన్ వంటి సమస్యలున్న వారికి కూడా టపాసుల పొగ అత్యంత ప్రమాదకరం. వీరిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయే ప్రమాదం ఉంది.

పిల్లలు, వృద్ధులు కూడా జాగ్రత్త!
పిల్లల ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, వృద్ధుల్లో శ్వాసకోశ సామర్థ్యం తగ్గడం వల్ల వీరు కూడా అధిక ప్రమాదంలో ఉంటారు. గర్భిణులు సైతం కాలుష్యానికి దూరంగా ఉండటం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.

నివారణే మార్గం.. ఎలా కాపాడుకోవాలి?
గ్రీన్ క్రాకర్స్ వాడామా లేదా అన్నది కాదు, అసలు టపాసుల పొగకు ఎంత దూరంగా ఉన్నామన్నదే ముఖ్యం.

  • సాధారణ ప్రజలు టపాసులకు బదులుగా దీపాలు, ముగ్గులు, సంగీతంతో పండుగ జరుపుకోవడం ఉత్తమం.
  • టపాసులు కాల్చే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గమనిస్తూ, కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకూడదు.
  • శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు వైద్యులు సూచించిన మందులు, ఇన్‌హేలర్లు తప్పనిసరిగా వాడాలి. పండుగ సమయంలో పొగకు పూర్తిగా దూరంగా, ఇంటి లోపలే ఉండటం శ్రేయస్కరం.
  • అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే, N95 మాస్క్ ధరించడం కొంతవరకు రక్షణ ఇస్తుంది. ఆయాసం, దగ్గు, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

చివ‌ర‌గా చెప్పాలంటే.. గ్రీన్ క్రాకర్స్ ఒక ముందడుగే కానీ, పరిష్కారం కాదు. నిజమైన దీపావళి వెలుగులు ఆకాశంలో కనిపించే రంగుల్లో కాదు, మన ఆత్మీయుల ఆరోగ్యకరమైన చిరునవ్వుల్లో ఉంటాయి. ఈ పండుగను పొగ రహితంగా, ఆరోగ్యకరంగా జరుపుకుందాం.