సాధారణంగా బైక్‌పై ఇద్దరు మనుషులు ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, ఓ యువకుడు తన బైక్‌పై వెనకాల ఓ చిన్న కోతిపిల్లను కూర్చోబెట్టుకుని వెళుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. యజమాని నడుమును గట్టిగా పట్టుకుని, అభద్రతా భావం లేకుండా ప్రయాణిస్తున్న ఆ కోతిపిల్ల వీడియో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. ఈ అందమైన బంధం వెనుక ఓ హృద్యమైన కథ ఉంది.

మనీష్ కుమార్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను తన ఖాతాలో పంచుకున్నారు. ఈ క్లిప్‌లో నకుల్ అనే యువకుడు బైక్ నడుపుతుండగా, ఓ చిన్న కోతిపిల్ల అతని వీపుపై కూర్చుని ఉంది. డైపర్ వేసుకున్న ఆ కోతిపిల్ల తన రెండు చేతులతో నకుల్ నడుమును గట్టిగా వాటేసుకుని కనిపించింది. అప్పుడప్పుడు చుట్టూ చూస్తున్నా, తన యజమానిని మాత్రం క్షణం కూడా వీడలేదు.

ఈ ప్రయాణం గురించి మనీష్ ఆరా తీయగా, నకుల్ తన స్నేహితుడైన ఆ కోతిపిల్ల కథను వివరించారు. దానికి 'బజరంగీ' అని పేరు పెట్టినట్లు చెప్పాడు. సుమారు ఒకటి, రెండేళ్ల క్రితం ఓ తుపానులో తల్లి చనిపోవడంతో ఈ కోతిపిల్ల అనాథగా మారిందని, అప్పటి నుంచి తానే దాన్ని చేరదీసి పెంచుకుంటున్నానని తెలిపాడు. 

"అది ఎప్పుడూ నన్ను ఇలా అంటిపెట్టుకునే ఉంటుంది. నేను దాన్ని స్వేచ్ఛగా వదిలేయడానికి ప్రయత్నించినా, అది నన్ను విడిచిపెట్టి వెళ్లదు. నాతో ఉండటమే దానికి ఇష్టం" అని నకుల్ చెప్పాడు. బజరంగీని తాను బలవంతంగా బంధించలేదని, అది ఇష్టపూర్వకంగానే తనతో ఉందని స్పష్టం చేశాడు.

ఈ హృద్యమైన దృశ్యం చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ రోజు తాము చూసిన అత్యంత అందమైన వీడియో ఇదేనంటూ కామెంట్లు పెడుతున్నారు. అనాథ కోతిపిల్లను చేరదీసి, ప్రేమగా చూసుకుంటున్న నకుల్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం అద్భుతమని, వారి స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చాలామంది ఆకాంక్షించారు.