బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

మరోవైపు, తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. సాయంత్రం 5:30 తర్వాత చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇక ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కన్నా 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.

కొత్తగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో వర్ష సూచనలు ఉన్నాయి. సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీయొచ్చు. తెలంగాణలోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడొచ్చని, సోమవారం తర్వాత వాతావరణం పొడిగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలిక, తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అధికారిక ప్రకటనలను గమనిస్తూ, చలి నుంచి, ఆకస్మిక వర్షాల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.